గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతకు భంగం కలిగితే సహించేది లేదు 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కేవీపీఎస్, ప్రజాసంఘాల డిమాండ్ తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల (పెద్దేముల్)లో చోటుచేసుకున్న ఘటనపై కేవీపీఎస్, విద్యార్థి, మైనారిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు చపాతీలు కాల్చే కర్రతో దాడి చేసి వాతలు పెట్టడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థిని తోటి విద్యార్థులు పలుమార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. “గురుకులం అంటే విద్యార్థులకు భద్రత, విద్య, సంరక్షణ కల్పించే ప్రదేశం. అక్కడే విద్యార్థులపై దాడులు జరిగి, ఫిర్యాదులను గోప్యంగా ఉంచే పరిస్థితి ఉంటే అది విద్యా వ్యవస్థకే అవమానం. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే ఏ అధికారి అయినా బాధ్యత నుంచి తప్పించుకోలేరు.” అని నాయకులు స్పష్టం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, వారిని లోపలికి అనుమతించకుండా గేట్లు మూసివేశారని తెలిపారు. ఈ ఘటనపై తాండూరు పట్టణ ఎస్సై, సిబ్బంది పాఠశాల వద్దకు చేరుకున్నప్పటికీ, విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పోలీసులను కూడా లోపలికి అనుమతించకుండా గేటుకు తాళం వేయడం పట్ల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలోనే కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలో సర్వే నిర్వహించి అనేక సమస్యలను గుర్తించామని, వాటిని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని నాయకులు తెలిపారు. పాఠశాలలో సీనియర్లు జూనియర్లను వేధించడం, విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలు, రాత్రి వేళల్లో విద్యార్థులు బయట తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా, ప్రతి ఆదివారం విద్యార్థులతో చపాతీలు తయారు చేయించడం, ఇతర వంట పనులు చేయించడం వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, విద్యార్థుల నుంచి పనులు చేయించడంపై వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “విద్యార్థుల చేత చదువు చెప్పించాల్సిన వయసులో వంట పనులు చేయించడం ఎందుకు? విద్యార్థుల భద్రత, హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు గురుకుల పాఠశాలను సందర్శించి, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు, వేధింపులు, ర్యాగింగ్‌కు కారణమైన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై కూడా నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, కేవీపీఎస్, విద్యార్థి, మైనారిటీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ ఎంహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, కేవీపీఎస్ నాయకులు పిట్ల నర్సిములు తదితరులు పాల్గొన్నారు.