నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 16:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రచ్చబండ (పాత గ్రామపంచాయతీ) ఆవరణలో గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ మరియు ఎస్ఐ నర్సిరెడ్డి హాజరై గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, అంకిరెడ్డిగూడెం వంటి చిన్న గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలు, జూదం, బెట్టింగ్ యాప్స్, సోషల్ మీడియా మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడితే కేసులు నమోదై భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్పోర్ట్ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాన్ని మాదకద్రవ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, పోలీసు అధికారులు సూచించిన మార్గదర్శకాలను గ్రామ ప్రజలు పాటిస్తూ అంకిరెడ్డిగూడెంను సురక్షితమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు. గ్రామంలో మాదకద్రవ్యాలు, జూదం, బెట్టింగ్ లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే తనకు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు.
అనంతరం పోలీసు అధికారులను సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వలందాస్ మహేష్ గౌడ్, బత్తుల అనుష మహేష్ గౌడ్, పాలం వెంకటేశం గౌడ్, ముద్దం లింగస్వామి గౌడ్, దొడ్ల అండాలు శెట్టయ్య గౌడ్, దండుగల వెంకటేశం, బొమ్మని శ్రావణి స్వామి గౌడ్, రాపోలు రేణుక మల్లేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు పెండం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, పోలీసు శాఖ సిబ్బంది, యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు పర్ని శ్రీధర్ రెడ్డి, భీమగోని మల్లేశం గౌడ్, పర్మి శ్రీనివాస్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, బొమ్మను స్వామి గౌడ్, సుర్వి విజయ్ గౌడ్, యాట శంకరయ్య తదితరులతో పాటు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


