నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును బంగారు బాటలో తీర్చిదిద్దుకోవాలని దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి సూచించారు. దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండాలని, తోటి విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల వైపు వెళ్తున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించాలని కోరారు.
విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ సమయంలో కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఐ వెంకట్ రెడ్డి అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, మంచి నడవడికతో విద్యనభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బత్తుల సాయిలు, లింగాస్వామి, వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

