నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి :
శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శనివారం యాదగిరిగుట్టలోని వాసవి సత్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి 81 మంది సభ్యులు పాల్గొన్నారు.
శబరిమల అయ్యప్ప సేవా సమాజం 2008లో ప్రారంభమై 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అయ్యప్ప స్వామి దీక్షలోని 18 పవిత్ర మెట్లకు, సంస్థ 18 సంవత్సరాల సేవా ప్రస్థానానికి ఉన్న ప్రాముఖ్యతపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం, సమాజంలో అయ్యప్ప భక్తులను ఏ విధంగా చైతన్యపరచాలి, యువతను మరియు భక్తులను సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై శబరిమల అయ్యప్ప సేవా సమాజం నేషనల్ జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి సభ్యులకు మార్గదర్శనం చేశారు.
శబరిమలలో తెలంగాణ అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి
సమావేశంలో SASS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంచికంటి ధనంజయ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్తున్నారని తెలిపారు. మొత్తం అయ్యప్ప భక్తుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తుల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొన్నారు.
గతంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం, వసతి తదితర సేవలకు సంబంధించిన సౌకర్యాలు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఆ సౌకర్యాలు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అందువల్ల శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం వసతి, దర్శన సహాయం మరియు ఇతర అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని జాతీయ కార్యవర్గాన్ని కోరారు.
స్థలం అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం తరఫున సుమారు రూ.14–15 లక్షల వరకు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంచికంటి ధనంజయ గారు తెలిపారు.
అలాగే SASSలో సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలు, అయ్యప్ప భక్తులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే అంశంపై సభ్యులు ప్రశ్నిస్తున్నారని, భక్తులకు ఉపయోగపడే విధంగా శబరిమలలో సౌకర్యాలు కల్పిస్తే సంస్థ సభ్యత్వాన్ని తెలంగాణలో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలకు ఉత్సాహం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అన్ని విధాలా చర్యలు తీసుకుంటాం – జాతీయ అధ్యక్షులు మురుగన్ సెల్వన్
తెలంగాణ ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై SASS జాతీయ అధ్యక్షులు మురుగన్ సెల్వన్ స్పందిస్తూ, శబరిమలలో అయ్యప్ప భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యమైన అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయ్యప్ప భక్తుల సేవే ప్రధాన లక్ష్యంగా సంస్థను మరింత బలోపేతం చేసి, దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో SASS జాతీయ అధ్యక్షులు మురుగన్ సెల్వన్, రాజశేఖర్ కుమరన్, రాజశేఖర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంచికంటి ధనంజయ, SASS నేషనల్ ట్రస్టీ ఐతా రాములు, జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, లలిత్ కుమార్, యాదాద్రి ఆలయ ధర్మకర్త గుండా మల్లయ్య, సింగిరికొండ నర్సింహ, గోపాల్ రెడ్డి, ఈరోడ్ రాజన్, తిరుచ్చి జి. ప్రభాకర్, నీలకంఠన్, శివశంకర్, శ్రీనివాస్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.
18 రాష్ట్రాల నుంచి 81 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశం ద్వారా శబరిమల అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, సంస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.


