నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి :
అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఓడిఎఫ్పీ, క్యాసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ దిగిన అనంతరం మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు అక్కడికక్కడే మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం అత్యంత విషాదకరమని బేరి రామచందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇస్నాపూర్లో వెల్డింగ్ పని చేస్తూ ఓ వ్యక్తి నిన్న మృతి చెందడంతో, చింతకుంటలో నిర్వహించనున్న ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అంత్యక్రియలకు వెళ్తున్న కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపిందన్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారంతా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియాను ప్రకటించి, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు.
అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బేరి రామచందర్ యాదవ్ కోరారు.

