నల్లగొండ , నాంపల్లి మండల ప్రతినిధి :
మండలంలోని దేవత్‌పల్లి గ్రామంలో కంది పంటపై పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ–ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు కంది సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులు, పురుగు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మునుగోడు వ్యవసాయ శాఖ ఏడీఏ బి. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా కంది సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పర్యావరణహిత పద్ధతులతో పంటల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి బండారు శివ మాట్లాడుతూ కంది పంటలో పురుగుల నివారణకు లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంతర పంటల సాగు చేపట్టాలని సూచించారు. పొలంబడి ద్వారా వ్యవసాయ శాఖ అందిస్తున్న సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఏఈఓ గణేష్, ఆత్మ బీటీఎం రమేష్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, దేవత్‌పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.


