మర్రిగూడ మండల ప్రతినిధి :
పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు శాస్త్రీయ సాగు విధానాలను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘కపాస్ కాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా వట్టిపల్లి గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లోజర్ స్పేసింగ్ (దగ్గరగా విత్తే విధానం), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా మొక్కల సంఖ్యను సమర్థంగా నిర్వహించవచ్చని తెలిపారు. తద్వారా పంట ఎదుగుదల, కలుపు నియంత్రణ, ఎరువుల వినియోగం, పురుగు–తెగుళ్ల యాజమాన్యంపై శాస్త్రీయంగా దృష్టి సారించవచ్చని వివరించారు. క్లోజర్ స్పేసింగ్, అధిక సాంద్రత పద్ధతుల్లో పత్తి సాగు చేస్తున్న రైతులు పంట కాలం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని సూచించారు.
అనంతరం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి సందర్శించారు. పొలాల్లో పత్తి మొక్కల ఎదుగుదల, విత్తన దూరం, మొక్కల సాంద్రత, పంట నిర్వహణ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమయానుకూలంగా చేపట్టాల్సిన సాగు చర్యలను అధికారులు వివరించారు.
రైతులు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించి తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని అధికారులు సూచించారు. పత్తి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాహస్, వట్టిపల్లి గ్రామ సర్పంచ్ శిరీషవాడ బిక్షమయ్య, ఉప సర్పంచ్ దగ్గుల లింగస్వామి, వట్టిపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి పి.విజయ్ కుమార్, యరగండ్లపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత, పతంజలి ఫీల్డ్ ఆఫీసర్ భాను చందర్, పలువురు వార్డు సభ్యులు, వట్టిపల్లి, యరగండ్లపల్లి గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

