నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా 22-A నిషేధిత భూముల జాబితా పేరుతో రైతులకు కొత్త ఇబ్బందులు కలిగించడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఉప్పు కృష్ణ అన్నారు.
అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించి చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి–ROR చట్టం కింద స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ప్రతి దరఖాస్తుదారునికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు.
గతంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నందున, వాటిని ఆధారాలతో పరిశీలించి చట్టబద్ధంగా సరిచేయాలని అన్నారు. పంట నమోదు, పంట కొనుగోలు OTPలు, యూరియా బుకింగ్ వంటి సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
22-A జాబితాను సమీక్షించి, చట్టపరమైన ఆధారం లేని నమోదులను తొలగించాలని, అసైన్డ్–సీలింగ్ భూములపై స్పష్టమైన విధానం ప్రకటించాలని, రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు

