నవపక్షం, నారాయణపేట ప్రతినిధి:
స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీహెచ్. ప్రియాంక శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ తదితర అధికారులతో కలిసి వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజలు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యార్థులు మరియు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వీఐపీలు, ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ పోలీస్ శాఖ తరఫున చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కలెక్టర్కు వివరించారు. పరేడ్ నిర్వహణ, ప్రజల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత పోలీస్ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


