నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి :
బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన చదువును సైతం పక్కనపెట్టి, ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో అనేకసార్లు లాఠీచార్జీలను ఎదుర్కొని, రాస్తారోకోల్లో పాల్గొని, జైలు జీవితాన్ని సైతం గడిపారు. ఉద్యమాల కోసం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమను ఆదుకుంటారని ఆశించిన ఉద్యమకారులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన గుర్తింపు, సహాయం అందించకపోవడం విచారకరం. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక లక్ష్మణ్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడటం తెలంగాణ సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన విషాదకర పరిణామం.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రూ.1,400 కోట్ల పార్టీ నిధుల నుంచి ఇటువంటి నిబద్ధత కలిగిన బహుజన తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాల్సిన బాధ్యత జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసైనా బీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కమిషన్ సభ్యురాలిగా నియమించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా అమరవీరుల సమస్యల పరిష్కారానికి కేకే, ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
త్వరలో ఎర్రవల్లిలో అమరవీరుల కుటుంబాలకు శ్రీకాంతాచారి పేరు మీద ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి, తన సొంత పార్టీకి చెందిన తెలంగాణ ఉద్యమకారులను, ముఖ్యంగా బహుజన వర్గాలకు చెందిన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గానికి చెందిన బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు


