నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 326లో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్త, వ్యర్థాలను తరలించి వేసేందుకు డంపింగ్ యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాలకు పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు వివరించారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వివరించి, గ్రామ ప్రజల ఆందోళనను తెలియజేశారు.
గ్రామ ప్రజల సమస్యను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో డంపింగ్ యార్డు రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఎమ్మెల్యే హామీపై గ్రామ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మని సాయి గౌడ్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు బత్తుల మహేష్ గౌడ్, ఎం. అధ్యక్షులు బీమగోని బాలరాజు యాదవ్, పాలకవర్గ సభ్యులు, ఉపసర్పంచ్ వలందాసు మహేష్ గౌడ్, బత్తుల అనూష మహేష్ గౌడ్, పాలెం వెంకటేష్ గౌడ్, ముద్దం లింగస్వామి గౌడ్, దండుగుల వెంకటేష్, మాజీ సర్పంచ్ ముద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్, యాట శంకరయ్య, సుర్వి వెంకటేష్, నల్ల లక్ష్మయ్య, ముద్దం రాజేష్, అంతటి వెంకటేష్, నల్ల వెంకటరమణ, బద్దం చేతన్ బాబు, బీమాగోని లాలు ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


