కుత్బుల్లాపూర్, ఆగస్టు 15: దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగం అజరామరమని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ దాసి నాగరాజు అన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు డాక్టర్ దాసి నాగరాజు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందల సంవత్సరాల పరాయి పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఆగస్టు 15 చారిత్రక దినమని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులతో పాటు ఎందరో వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు.
స్వాతంత్ర్యం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదని, దేశం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తుచేసుకునే పవిత్రమైన రోజని డాక్టర్ దాసి నాగరాజు అన్నారు. జాతీయ జెండాలోని కాషాయం ధైర్యం, త్యాగానికి; తెలుపు శాంతి, సత్యానికి; ఆకుపచ్చ అభివృద్ధి, సుసంపన్నతకు ప్రతీకలని వివరించారు. జెండా మధ్యలోని అశోక చక్రం నిరంతర ప్రగతికి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిందని, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయాన్ని కల్పించిందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను దేశానికి అందించిందని పేర్కొన్నారు.
“ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం ఎంత ముఖ్యమో.. ప్రతి మనసులో దేశభక్తి జెండా ఎగరడం అంతకంటే ముఖ్యం” అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యతను కాపాడుతూ, రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఏకైక మహోత్సవం జాతీయ జెండా పండుగ అని డాక్టర్ దాసి నాగరాజు అన్నారు.
ఈ కార్యక్రమాల్లో లీడర్ నరసింహారెడ్డి, బండారు లేఔట్ బీజేపీ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్, ధూళిపాళ్ల రాజేష్, సచిన్, రాయల్ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి, వైస్ ప్రిన్సిపల్ పర్వీన్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, జై దుర్గ భవాని వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


