నవపక్షం,నల్లగొండ జిల్లా ప్రతినిధి:
నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని 28 గ్రామాల వాలంటీర్లకు డిజిటల్ క్రాప్ సర్వేపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) వినోద్ కుమార్, మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) వేణుగోపాల్, నాంపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) బండారు శివ హాజరై వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) పాల్గొని డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పంటల వివరాలను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నమోదు చేయడంలో డిజిటల్ క్రాప్ సర్వే ఎంతో కీలకమని తెలిపారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా పంటల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు.
వాలంటీర్లు క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వయం చేసుకుంటూ సర్వేను బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు. సర్వేలో సేకరించిన వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో నాంపల్లి మండల పరిధిలోని 28 గ్రామాల వాలంటీర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


