నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి | ఆగస్టు 28
భారతీయ సంస్కృతిలో సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రత్యేకమైన స్థానం ఉందని సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహ అన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ఆయన తన సోదరి చేత రాఖీ కట్టించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హెచ్. నర్సింహ మాట్లాడుతూ సృష్టిలో సోదరి ప్రేమకు మించిన ఆప్యాయత, అనుబంధం మరొకటి లేదని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆత్మీయతకు రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ప్రస్తుత సమాజంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కారణంగా మానవీయ విలువలు క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలు, మానవీయతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మన దేశంలోని పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, జాతి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ, మానవ సంబంధాల విలువను చాటి చెబుతూ, దారి తప్పుతున్న మనుషులను సన్మార్గంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయని హెచ్. నర్సింహ పేర్కొన్నారు.
రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కుటుంబ బంధాలను గౌరవిస్తూ, ప్రేమ, ఆప్యాయత, మానవీయ విలువలను పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


