నవపక్షం, బోడుప్పల్ ప్రతినిధి :
బోడుప్పల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ 1వ డివిజన్ మాజీ అధ్యక్షుడు దుర్గపు క్రిష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించుకోవాల్సిందే తప్ప, రాజకీయ పార్టీ కార్యాలయాల వద్ద ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సమర్థనీయం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నించడం తమ బాధ్యత అని క్రిష్ణ గౌడ్ పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
నిరసనలు నిర్వహించాలనుకుంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. పార్టీ కార్యాలయాల వద్ద దాడులు లేదా ఉద్రిక్తతలకు దారితీసే ఘటనలు జరగడం సరికాదని అన్నారు.
అదేవిధంగా, తమ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన సమయంలో, కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం వద్దకు చేరకుండా పోలీసు యంత్రాంగం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోయిందో అర్థం కావడం లేదని క్రిష్ణ గౌడ్ ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు.
సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ఎవరికి ఇబ్బంది కలగకుండా రోడ్డుపై కూర్చొని శాంతియుతంగా నిర్వహించామని క్రిష్ణ గౌడ్ తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే అవి శాంతియుత వాతావరణంలోనే వ్యక్తం కావాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తల భద్రతకు సంబంధించి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని క్రిష్ణ గౌడ్ కోరారు.


