నవపక్షం, బచ్చన్నపేట మండల ప్రతినిధి :
బచ్చన్నపేట చౌరస్తాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అల్వాల నర్సింగరావు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో బచ్చన్నపేట గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.
వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆటో యూనియన్ సభ్యులను ఆయన అభినందించారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవాభావాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు.


