నవపక్షం , శాలిగౌరారం:
వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని శాలిగౌరారం ఎస్ఐ పి.బాబు సూచించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేశ్ మండపాల వద్ద, అలాగే వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్, భారీ శబ్దాలు చేసే బాక్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
నిమజ్జన కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. వినాయక నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ పి.బాబు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

