నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన SHRESTA పథకం కింద ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు చదివిన తెలంగాణ విద్యార్థులకు స్థానికత నిబంధనల కారణంగా MBBS సీట్ల కేటాయింపులో ఎదురవుతున్న సమస్యలను BRSV రాష్ట్ర కార్యదర్శి డా. కొండ గణేష్, BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. తుంగ బాలుకు వివరించారు.
GO No. 33 ప్రకారం స్థానికతకు సంబంధించిన నిబంధనల కారణంగా SHRESTA పాఠశాలల్లో ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసించిన తెలంగాణ విద్యార్థులకు MBBS సీట్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, NEETలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ కొందరు విద్యార్థులు సీట్లు పొందలేకపోతున్నారని డా. కొండ గణేష్ వివరించారు. ఈ నిబంధనల ప్రభావంతో అర్హులైన విద్యార్థులు MBBS, IIT వంటి ఉన్నత విద్యావకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి, నిబంధనలను సమీక్షించి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత మూడేళ్ల పాలనలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని BRSV నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గురుకులాల్లో చోటుచేసుకున్న విద్యార్థుల మరణాల ఘటనలపై సమగ్ర పరిశీలన జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించారు. దివంగత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించిందని, ప్రస్తుతం ఫీజు బకాయిలు మరియు చెల్లింపుల జాప్యం కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని BRSV నాయకులు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
SHRESTA విద్యార్థుల స్థానికత సమస్యపై BRSV ఆధ్వర్యంలో సంబంధిత వర్గాల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, విద్యార్థులకు న్యాయం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని చర్చించారు. ఈ నెల 29న నిర్వహించనున్న ఓయూ BRSV విద్యార్థి కవాతును విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించారు.
ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర నాయకులు గోలి శివ ప్రసన్న కుమార్, BRS యువజన విభాగం రాష్ట్ర నాయకులు యనగందుల శేఖర్ (సిరిసిల్ల), SHRESTA పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ, ఉన్నత విద్యావకాశాల్లో సమాన అవకాశాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని BRSV నాయకులు కోరారు.


