నవపక్షం, గూడూరు ప్రతినిధి :
అనంతసాగరం మండలం బొమ్మవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోమశిల గ్రామ ఆరోగ్య ఉపకేంద్రంలో ఖాళీగా ఉన్న హిల్ కాలనీ ఆశా కార్యకర్త పోస్టును నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని సోమశిల గ్రామానికి చెందిన చాపల మణికంఠ జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన అర్జీలో ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్త పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు, స్థానికత, ఇతర అర్హతలు, మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
తమ ప్రాంతానికి చెందిన చాపల వాణి నర్సింగ్ జీఎన్‌ఎం విద్యార్హతతో పాటు పోస్టుకు అవసరమైన అర్హతలు కలిగి ఉన్నారని అర్జీలో పేర్కొన్నారు. అయితే ఎంపిక ప్రక్రియలో అర్హతలు, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర ప్రభావాలకు అవకాశం ఉందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో విషయంపై సమగ్రంగా విచారణ జరిపి, నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అభ్యర్థుల దరఖాస్తులు, విద్యార్హతలు, స్థానికత, మెరిట్‌ను పరిశీలించాలని కోరారు. అలాగే ఈ అంశాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చాపల మణికంఠ జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.


