నవపక్షం, నల్లగొండ ప్రతినిధి :
నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో హత్య ఘటన చోటుచేసుకుంది.
అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని 402వ గదిలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు తమిళనాడుకు చెందిన కూలీగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నల్గొండలో నూతనంగా ఏర్పాటు చేయనున్న చెన్నై షాపింగ్ మాల్ నిర్మాణ పనుల నిమిత్తం తమిళనాడు నుంచి కూలీలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శివరామరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్‌ల సహకారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

