నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. హైదరాబాద్ మణికొండకు చెందిన వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (42) ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరారు.
వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నెల 26న దీప్తి రెడ్డిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
దీంతో ఆమె భర్త ప్రదీప్ రెడ్డి అవయవదానానికి ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో దీప్తి రెడ్డి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను దానం చేశారు.
ఈ అవయవాలను అవసరమైన నలుగురు రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీవన్‌దాన్ వెల్లడించింది. తన జీవితాన్ని కోల్పోయినా.. అవయవదానం ద్వారా నలుగురికి కొత్త జీవితం అందించిన దీప్తి రెడ్డి కుటుంబం చూపిన మానవత్వం పలువురికి ఆదర్శంగా నిలిచింది.

