నవపక్షం, కోట ప్రతినిధి :
కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మంగళవారం కాలనీలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారులు బురదమయంగా మారుతున్నాయని స్థానికులు వినోద్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యను గుర్తించిన ఆయన వెంటనే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి,పంచాయతీరాజ్ పీఆర్ఏఈ కిరణ్ ను శ్యామసుందరపురం కాలనీకి పంపించి సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన కొలతలు,మెజర్మెంట్లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు కాలనీలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు.ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు త్వరలోనే శాంక్షన్ లభించే అవకాశం ఉందని,అనంతరం పనులు ప్రారంభమవుతాయని నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.కాలనీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.సమస్యను తన దృష్టికి తీసుకెళ్లిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి,వెంటనే స్పందించి అధికారులను పంపించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం,జమ్మి ప్రసాద్,హనుమంత్ రెడ్డి,నందం మోహన్, పుల్లయ్య,అనిల్, బాలాజీ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


