నవపక్షం, కోట మండల ప్రతినిధి :
కోట మండలం కొక్కుపాడు సెక్టార్ పరిధిలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో సోమవారం 8వ జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ మునికుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ పద్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మహిళలకు పోషకాహారం, ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు,చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే పోషణ మహోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు చిన్న వయస్సు నుంచే సరైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమన్నారు.గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు.అందువల్ల పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు.
ఆకుకూరలు,కూరగాయలు, పప్పుధాన్యాలు,చిరుధాన్యాలు,పండ్లు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని పద్మ సూచించారు.పిల్లలకు కేవలం కడుపు నిండే ఆహారం కాకుండా శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు.
చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి బరువు, ఆరోగ్య పరిస్థితిపై అంగన్‌వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం,ఆరోగ్య సేవలను గర్భిణులు,బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహారంతో పాటు పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పద్మ పేర్కొన్నారు.భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శుద్ధమైన తాగునీటిని వినియోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు.కిశోర బాలికలు కూడా పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎదుగుతున్న వయస్సులో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు.
ఈ సందర్భంగా నెల్లూరుపల్లి అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ కార్యక్రమంలో సన్మానం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డ ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని సూపర్వైజర్ పద్మ పేర్కొన్నారు.ప్రతి కుటుంబంలో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది విజయలక్ష్మి, మీరమ్మ, హేమలత,స్వాతి,జయమ్మ,రమణమ్మ,తల్లులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

