నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మర్రిగూడ మండలం రామ్‌రెడ్డిపల్లి గ్రామంలో ‘కపాస్ కాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా పత్తిలో క్లోజర్ స్పేసింగ్ (దగ్గరగా విత్తే విధానం), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా మొక్కల సంఖ్యను సమర్థంగా నిర్వహించవచ్చని తెలిపారు. దీంతో పంట ఎదుగుదల, కలుపు నియంత్రణ, ఎరువుల వినియోగం, పురుగు–తెగుళ్ల యాజమాన్యాన్ని శాస్త్రీయంగా చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. నేల స్వభావం, పంట కాలం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని రైతులకు సూచించారు.
అనంతరం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి సందర్శించారు. పత్తి మొక్కల ఎదుగుదల, విత్తన దూరం, పంట నిర్వహణ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, సమయానుకూలంగా చేపట్టాల్సిన సాగు చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు.
రైతులు సంప్రదాయ సాగు విధానాలకే పరిమితం కాకుండా ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అవలంబించి తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. పత్తి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, మండల వ్యవసాయ అధికారి సాహస్, కుదాబక్షపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి జి. సుజాత, రైతులు తదితరులు పాల్గొన్నారు.


