నవపక్షం, శాలిగౌరారం, అక్టోబర్ 9 :
పోలీస్ అమరవీరుల దినోత్సవం (అక్టోబర్ 21)ను పురస్కరించుకుని శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల మోడల్ స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతతో పాటు రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, విద్యాభ్యాసం, భవిష్యత్తు, కుటుంబ జీవనంపై కూడా ప్రతికూల ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాల వినియోగానికి ప్రోత్సహించినా, వాటి విక్రయాలు లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించడం, రహదారిపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలను వివరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా, పాదచారులు సైతం రహదారిని దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, తాము నేర్చుకున్న రహదారి భద్రతా నియమాలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా తెలియజేయాలని పోలీసులు కోరారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం, రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల భద్రత, ముఖ్యంగా యువతలో సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లు రవి నాయక్, దేవేందర్, నాగయ్య, జి. మనోహర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


