నవపక్షం, మద్నూర్ ప్రతినిధి :
అవల్ గావ్ గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అందంగా పేర్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా డీజే ఏర్పాటు చేయడంతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. డీజే పాటలకు అనుగుణంగా మహిళలు, యువతులు, గ్రామస్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మహిళలకు ప్రత్యేక కానుకల పంపిణీ
బతుకమ్మ ఆటల అనంతరం వేడుకల్లో పాల్గొన్న మహిళలకు వారి బతుకమ్మలను బట్టి అందమైన కానుకలను అందజేశారు. ఈ బహుమతుల పంపిణీ కార్యక్రమం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక కానుకలు అందించడం వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్య బాయి, ఉప సర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు నరసవ్వ, బాలరాజు, కండు యాదవ్, శేష భాయ్, దీప యాదవ్, మాజీ ఎంపీటీసీ రాయప్ప పటేల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొనడంతో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.


