నవపక్షం, తిప్పర్తి మండల ప్రతినిధి :
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ శ్రీను సూచించారు. తిప్పర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల నివారణపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని తెలిపారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని స్పష్టం చేశారు.
ఆన్లైన్లో అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద సందేశాలను నమ్మి డబ్బులు పంపవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ స్వామి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


