నవపక్షం, రాయవరం ప్రతినిధి :
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పరాకాష్టకు చేరింది. రాయవరం మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కురకాళ్లపల్లి గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కాదా ప్రభాకరరావు భార్య కాద పద్మ శుక్రవారం రోజున తూర్పుగోదావరి జిల్లా, జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ల ర్యాలీలో కూటమి శ్రేణులు భారీగా పాల్గొని తమ బలాన్ని చాటారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నిర్వహించిన ర్యాలీలో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని పద్మకు పూర్తి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. మండలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని, మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు జోగేశ్వరరావు, తెదేపా సీనియర్ నాయకులు వి.వి.వి. చౌదరి కూర్మాపురం(అబ్బు), స్థానిక ప్రజల ఆశీస్సులతో, కూటమి నాయకుల సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


