నవపక్షం, మండపేట ప్రతినిధి :
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర నీటి సరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని కోరారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కీలక స్థానాలు కేటాయించినట్లు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వెల్లడించారు.
కేటాయింపుల్లో భాగంగా మండపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానం, కపిలేశ్వరపురం మండల జెడ్పీటీసీ స్థానం, నియోజకవర్గ పరిధిలో 18 ఎంపీటీసీ స్థానాలు, మండపేట పట్టణంలో 10 మున్సిపల్ వార్డులు జనసేనకు కేటాయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు లీలాకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, పరస్పర సహకారంతో స్థానాల కేటాయింపు జరిగిందన్నారు. కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు మరింత చేరువై స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, ప్రజాసేవకు ప్రాధాన్యమిస్తామన్నారు. నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని లీలాకృష్ణ పిలుపునిచ్చారు.


