నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి:
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత నిధులు అక్టోబర్ 30న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోలా హరీష్ పటేల్ తెలిపారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల సమయంలో ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో అందిస్తున్నారని వివరించారు. ఈ ఆర్థిక సాయం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
