నవపక్షం, వేములవాడ ప్రతినిధి:
వేములవాడ పట్టణంలో అభివృద్ధి పేరుతో చెరువు కట్టక్రింది ప్రాంతంలో గెజిట్ నంబర్ G/29/2017 పరిధిలోని సుమారు 20 ఎకరాల 20 గుంటల భూమిని 2017లో భూసేకరణ కింద తీసుకున్నప్పటికీ,ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అదే సమయంలో భూమి యజమానులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని బీజేపీ ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆరోపించారు.ఈ సమస్యపై సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,వైటీడీఏ వైస్ చైర్మన్ లకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాజన్న ఆలయ అభివృద్ధి కోసం భూసేకరణ జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం,భూ యజమానులకు నష్టపరిహారం అందించకపోవడం వల్ల దాదాపు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.ఈ భూముల్లో కొంతమందికి వారసత్వంగా భూములు లభించగా,మరికొందరు తమ పిల్లల వివాహాలు,ఉన్నత విద్య,భవిష్యత్ అవసరాల కోసం భూములను కొనుగోలు చేశారని పేర్కొన్నారు.అయితే భూసేకరణ పేరుతో సంవత్సరాలుగా ఆ భూములపై హక్కులు,వినియోగంపై అనిశ్చితి నెలకొనడంతో పేద,మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయన్నారు.గత ప్రభుత్వ హయాంలో భూముల్లో అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చినా అవి అమలు కాలేదని సంతోష్ బాబు విమర్శించారు.2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని,అయితే ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి భూమి యజమానులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు.గతంలో వేములవాడ బద్ది పోచమ్మ దేవాలయ అభివృద్ధి సందర్భంగా నిర్వాసితులకు ప్యాకేజీ అందించిన విధంగానే చెరువు కట్టక్రింది భూముల యజమానులకు కూడా అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.బాధిత కుటుంబాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి,వారికి తగిన న్యాయం చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు రేగుల సంతోష్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ జక్కుల తిరుపతి,పార్టీ నాయకులు మాల్లారం తిరుపతి,కోరేపు వెంకటేష్,ఖమ్మం పృథ్వీరాజ్ లతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


