నవపక్షం, భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :
మేదరమెట్ల గ్రామానికి చెందిన పసునుటి బాలకృష్ణ కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా కాళ్లలో తిమ్మిర్లు రావడం, నడవలేక కిందపడిపోవడం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడటం ప్రారంభించారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్య పరీక్షలు చేయించగా, బాలకృష్ణ కండరాల క్షీణత వ్యాధి (మస్కులర్ డిస్ట్రోపీ)తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు.
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంపై విధి పగబట్టినట్లుగా, ఈ మాయదారి వ్యాధి బాలకృష్ణను మంచానికే పరిమితం చేసింది. కుటుంబాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో భార్య, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పదో తరగతి 2009–2010 బ్యాచ్‌కు చెందిన బాలకృష్ణ స్నేహితులు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్నేహితులందరూ కలిసి తమ వంతు సహాయంగా రూ.25 వేల నగదును సేకరించి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేసి అండగా నిలిచారు.
ఆపద సమయంలో తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రుల మానవత్వాన్ని పలువురు అభినందించారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్నేహితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 2009–2010 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన బాలకృష్ణ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.


