నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :
పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు శాస్త్రీయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘కపాస్ కాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా సరంపేట గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తిలో దగ్గరగా విత్తే విధానం (క్లోజర్ స్పేసింగ్), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా ఎకరాకు మొక్కల సంఖ్యను పెంచుకోవడంతో పాటు పంట యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టవచ్చన్నారు. పంట పెరుగుదల, కలుపు నియంత్రణ, ఎరువుల వినియోగం, పురుగు–తెగుళ్ల యాజమాన్యంపై శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. క్లోజర్ స్పేసింగ్, అధిక సాంద్రత పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులు పంట కాలం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
అనంతరం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్న రైతుల పొలాలను వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి సందర్శించారు. పత్తి మొక్కల ఎదుగుదల, విత్తనాల మధ్య దూరం, పంట యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమయానుకూలంగా చేపట్టాల్సిన సాగు చర్యలను అధికారులు వివరించారు. రైతులు సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా శాస్త్రీయ, ఆధునిక సాగు విధానాలను అవలంబించి తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. పత్తి సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సరంపేట గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి, వ్యవసాయ అధికారి సహస్, దామర భీమనపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి బి. శివకుమార్, మండల ఏఈవోలు పి. విజయ్‌కుమార్, జి. సుజాత, మాజీ సర్పంచ్ మాడుగుల దశరథ, దామెర రాములు, చిర్రపు వెంకటరెడ్డి, రమావత్ రాములు, వీసం సుందర్ తదితరులు పాల్గొన్నారు.


