నవపక్షం, కోట మండల ప్రతినిధి :
పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని అంగన్వాడీ సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ అన్నారు. చిన వంజివాక అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ ఆధ్వర్యంలో పోషకాహార మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఐ. కిష్టమ్మ మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి బరువు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహారంతో పాటు ఐదుగురు గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లితో పాటు శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
పరిశుభ్రత కూడా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని సూపర్వైజర్ పేర్కొన్నారు. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శుద్ధమైన తాగునీటిని వినియోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు.
అదేవిధంగా కిశోర బాలికలు ఎదుగుతున్న వయస్సులో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని కోరారు. “ఆరోగ్యవంతమైన తల్లి.. ఆరోగ్యవంతమైన బిడ్డ.. ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది” అనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తించాలని, పోషకాహారంపై కుటుంబాల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐ. కిష్టమ్మ సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవిద్య, అనిత, సరోజనమ్మ, రేవతి, విజయలక్ష్మి, మల్లికార్జున, అమ్మ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


