నవపక్షం, కాకినాడ ప్రతినిధి :
కాకినాడ జిల్లా తుని మండలం రావికంపాడు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం పట్ల కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఎంపీ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం కాలినడకన బయలుదేరిన భవానీ భక్తులు జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పాదయాత్ర చేసే సమయంలో రేడియం స్టిక్కర్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.


