నవపక్షం, పులివెందుల ప్రతినిధి :
పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన పార్టీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు అనవసరంగా కాల్పులు జరపడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులకు ప్రతి నిమిషం అండగా ఉంటానని స్పష్టం చేసిన జగన్ పులివెందులలో తమ కార్యకర్తలపై చేయి వేస్తే నేరుగా తనపైనే చేయి వేసినట్లుగా భావిస్తానని ఘాటుగా హెచ్చరించారు.
పోలీసు యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన సూచించారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు మొగ్గు చూపుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరించవద్దని ఇప్పటికైనా పోలీసులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా ప్రవర్తించిన ఏ ఒక్క అధికారిని కూడా భవిష్యత్తులో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తమ సమయం కూడా వస్తుందని అన్యాయం చేసిన అధికారులు ఉద్యోగ విరమణ చేసినప్పటికీ వారిని వెతికి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.సమావేశం ముగిసిన వెంటనే క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.


