నవపక్షం, మునుగోడు ప్రతినిధి :
తెలంగాణ చేనేత రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే ప్రతిష్ఠాత్మక సంస్థ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హ్యాండ్లూమ్ హౌస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా గట్టుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ ఏడు దశాబ్దాల చరిత్రలో తెలంగాణకు తొలిసారిగా ఈ స్థాయి ప్రాతినిధ్యం లభించడం విశేషం.
జనరల్ బాడీ సభ్యురాలిగా ఎన్నికైన వజ్రమ్మ, వివిధ రాష్ట్రాల ప్రతినిధుల మద్దతుతో డైరెక్టర్గా ఎన్నికై మూడు కీలక విజయాలను సాధించారు. ఆమె భర్త, ఆప్కో మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశం సహకారం, సహకార రంగంలో అనుభవం ఈ విజయానికి తోడ్పడ్డాయి.
ఈ ఎన్నికతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మరింత మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట తదితర ప్రాంతాల చేనేత కళాకారులకు ప్రయోజనం చేకూరేలా ఆమె కృషి చేయాలని చేనేత వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. వజ్రమ్మ విజయంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పద్మశాలి సంఘాలు, చేనేత సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.


