నవపక్షం, అశ్వరావుపేట ప్రతినిధి:
అశ్వారావు పేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం గ్రామాల్లో పర్యటించారు.
ముందుగా తిరుమలకుంట గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించారు. సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మామిళ్లవారిగూడెం గ్రామంలో రామినేని ఆదిత్య దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆదిత్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


