నవపక్షం, కోట ప్రతినిధి:
నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఫోనిక్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రేయ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని తుపిలిపాలెం సముద్ర తీరంలో “ఫోనిక్స్ ఆరెంజ్ డే – క్లీన్ బీచ్, క్లీన్ ఫ్యూచర్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రేయ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజు నిర్వహించే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అలవర్చుకోవాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు.సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల సముద్ర జీవులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు.
చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ,సామాజిక బాధ్యత, పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు పుస్తకాల ద్వారా విద్యను అభ్యసించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు.
మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం” అని ప్రిన్సిపల్ శ్రేయ పిలుపునిచ్చారు.
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రేయ,సిబ్బంది శ్వేతా,రమేష్, మనోహర్,జూష్ణ తదితరులు పాల్గొన్నారు.


