భద్రాద్రి కొత్తగూడెం, నవపక్షం ప్రతినిధి :
జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన సత్యం అహింస శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల్లో అగ్రగణ్యుడైన మహాత్మా గాంధీజీ సత్యాగ్రహం అహింసాయుత పోరాటం ద్వారా భారతదేశ స్వాతంత్ర్య సాధనకు మార్గం సుగమం చేశారని తెలిపారు. గాంధీజీ చూపిన ఆలోచనలు సిద్ధాంతాలు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరిస్తే సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని అన్నారు. గాంధీజీ బోధనలు నేటి యువతకు ఎంతో ప్రేరణనిస్తాయని కలెక్టర్ అన్నారు. క్రమశిక్షణ నిజాయితీ సేవాభావం సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. తమ వృత్తి వ్యక్తిగత జీవితం సామాజిక బాధ్యతల్లో గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛత పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజాసేవలో పారదర్శకత జవాబుదారీతనం మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గాంధీజీ జీవితం ఆయన ఆచరించిన విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువత గాంధీజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సీపీఓ సునీత, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి అనూష, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


