నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :
భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సూపర్ మార్కెట్లో ఆహార భద్రతా నిబంధనల అమలును పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వంకాయలపాటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఆహార భద్రత, పరిశుభ్రత, నిల్వ, లేబులింగ్, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.
తనిఖీల సమయంలో సంబంధిత సంస్థలో కొన్ని ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించి లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో, Food Safety and Standards Act, 2006లోని Section 32(1)(a) ప్రకారం Improvement Notice జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో భాగంగా విక్రయానికి ఉంచిన కొన్ని కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఆహార ఉత్పత్తుల్లో కుళ్లినవి, వినియోగానికి అనర్హంగా కనిపించినవి, అలాగే గడువు ముగిసిన ఉత్పత్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా పరిశుభ్రత, పెస్ట్ కంట్రోల్, లేబులింగ్, ఆహారాన్ని నిర్వహించే సిబ్బందికి సంబంధించిన వైద్య ఫిట్నెస్ రికార్డులు, అవసరమైన రికార్డుల నిర్వహణ తదితర అంశాల్లో లోపాలను నమోదు చేసినట్లు తెలిపారు.
సుమారు 118 కిలోల ఆహార పదార్థాల ధ్వంసం
తనిఖీల సందర్భంగా వినియోగానికి అనర్హంగా గుర్తించిన కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఆహార ఉత్పత్తులను అధికారులు వేరు చేసి, నిబంధనల ప్రకారం తొలగించి ధ్వంసం చేయించారు. వీటి మొత్తం పరిమాణం సుమారు 118 కిలోలు కాగా, వాటి అంచనా మార్కెట్ విలువ సుమారు రూ.60,000గా అధికారులు తెలిపారు.
నిబంధనలు పాటించాలని అధికారుల సూచన
ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వంకాయలపాటి జ్యోతిర్మయి మాట్లాడుతూ, ఆహార వ్యాపార నిర్వాహకులు Food Safety and Standards Act, 2006 మరియు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు.
వినియోగానికి అనర్హమైన, గడువు ముగిసిన లేదా నిబంధనలకు విరుద్ధమైన ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచరాదని తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, లేబులింగ్, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, అవసరమైన రికార్డుల నిర్వహణ తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
జారీ చేసిన ఇంప్రూవ్మెంట్ నోటీసులో పేర్కొన్న లోపాలను నిర్దేశిత గడువులోగా సరిదిద్దాల్సి ఉంటుందని, లేని పక్షంలో అమలులో ఉన్న చట్టం మరియు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఆహార వ్యాపార సంస్థలపై తనిఖీలు మరియు చట్టపరమైన చర్యలు నిబంధనల ప్రకారం కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.


