నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి 4వ వార్డులో మాజీ సర్పంచ్ దయాకరాచారి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండా రెపరెపలాడింది.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దయాకరాచారి మాట్లాడుతూ, నేటి విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడం వల్లే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని తెలిపారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ వంటి లక్షణాలను పెంపొందించాలని దయాకరాచారి సూచించారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ, దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఊదారి యాదయ్య, బొంగు స్వామి గౌడ్, రాగిరి సత్యనారాయణ, 6వ వార్డు అధ్యక్షులు రావుల ముత్యాలు, 15వ వార్డు అధ్యక్షులు ఊదారి కిషోర్, బొడ్డు ముత్యం గౌడ్, జిట్టా క్రిష్ణ, కొయ్యడ లింగస్వామి, విఘ్నేష్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పాల్గొన్న వారందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


