నారాయణపేట జిల్లాలోని రైతు సోదరులు వానాకాలం–2026 సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేసి నష్టపోయే కంటే, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బావులు, బోర్లు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు లేవని, అందువల్ల వరి పంట సాగుకు అనుకూల పరిస్థితులు లేవని పేర్కొన్నారు.
కాబట్టి రైతులు ఈ నెలాఖరు వరకు పెసర, మినుములు, మొక్కజొన్న, ఉలవలు, అలసంద, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు తదితర ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో కోరారు.
రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.


