నారాయణపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నారాయణపేట జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేయడం వల్లే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సూచించారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ సేవకు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ప్రజా సేవే పోలీసుల ప్రధాన లక్ష్యం
జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో మరింత సమర్థవంతంగా పనిచేసి నారాయణపేట జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, నిజాయితీతో, క్రమశిక్షణతో నిర్వర్తించాలని తెలిపారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, వారికి చట్టపరంగా తక్షణ సహాయం అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందాలని సూచించారు.
తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా మంచి గుర్తింపు పొందిందని ఎస్పీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో అలవర్చుకుని విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
సైబర్ నేరాలు, ఆధునిక నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తున్నందున పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత, ఆధునిక పోలీసింగ్ విధానాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
పోలీసులు ప్రజలకు చేరువగా ఉంటూ, ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, వారి సమస్యలను పరిష్కరించడం, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.
ప్రతి ఉద్యోగి తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐలు నరసింహ, విజయ్ భాస్కర్, ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


