నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 15:
చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన ఎం.డి. సలీమా (38) అదృశ్యమైన కేసును చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 25న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సలీమా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి ఎం.డి. పెద్ద సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. జూలై 25న మధ్యాహ్నం భువనగిరి బస్టాండ్‌లో సలీమాను బషీర్ తన పల్సర్ మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని తుర్కపల్లి రోడ్డులోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు ఇద్దరూ మాట్లాడుకున్న అనంతరం ఘర్షణ చోటుచేసుకుంది. సలీమా తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బషీర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో సలీమాను వదిలించుకోవాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు సయ్యద్ బషీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జుడీష్యల్ రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.


