గురువారం చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్ గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుబంధంతో, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి యాదాద్రి సేవాశ్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఎంతమంది వృద్ధులు ఉంటున్నారని , వారికి కల్పిస్తున్న వసతులు, ప్రతిరోజూ అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు.
వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయించడం,జరుగుతుందా అని,క్యారమ్స్, వివిధ ఆటలు ఆడించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ అభినందించారు. వృద్ధుల ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వృద్ధులను అప్పుడప్పుడు విహారయాత్రలు, పర్యటనలకు తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. వయస్సు పైబడిన వారికి ఇలాంటి పర్యటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు ఆత్మసంతృప్తిని అందిస్తాయని తెలిపారు. వారి పట్ల ఆప్యాయత, ఆదరణ చూపుతూ కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలని సూచించారు.ఆశ్రమానికి ప్రభుత్వం పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆశ్రమంలోని వృద్ధులకు కలెక్టర్ పండ్లు పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడారు,వారి ఆరోగ్యం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.వృద్ధుల సంక్షేమం కోసం సేవాశ్రమం నిర్వాహకులు చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమం లో చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి,శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, సాయి సేవా నిర్వాహకులు అశోక్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


