నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1:
మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన విత్తన గణపతిని సెన్సార్ బోర్డు సభ్యురాలు నాగ సాహితీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు.
ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పూజించిన అనంతరం విత్తన గణపతిని మట్టిలో నాటితే, అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా భక్తి భావంతో గణపతిని పూజించడంతో పాటు, అనంతరం అదే గణపతిని మొక్కగా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాయని అన్నారు.
సెన్సార్ బోర్డు సభ్యురాలు నాగ సాహితీ విత్తన గణపతి కార్యక్రమాన్ని అభినందిస్తూ, పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.


