నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. హకీంపేట్ చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, 400 పడకల ఆసుపత్రితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టల్ భవన సముదాయాల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఎడ్యుకేషన్ హబ్‌లో చేపడుతున్న అన్ని నిర్మాణ పనుల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాల నాణ్యతతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.


