నవపక్షం, నారాయణపురం, సెప్టెంబర్ 7:
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం వాటి అమలును పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి, ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


