నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 10:
నాంపల్లి మండలంలోని దేవత్‌పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ–ATMA ఆధ్వర్యంలో కంది పంటపై పొలంబడి (Farm School) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు కంది పంట సాగులో చేపట్టాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, అధిక దిగుబడుల సాధనపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు.
రైతులు నాణ్యమైన విత్తనాల ఎంపిక, సరైన విత్తే సమయం, మొక్కల సాంద్రత, కలుపు యాజమాన్యం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం వంటి అంశాలపై శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు.
కంది పంటలో శనగపచ్చ పురుగు, మారుకా మరియు కాయ తొలుచు పురుగు వంటి ప్రధాన చీడపీడలను గుర్తించే విధానం, వాటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. పంట పొలాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, చీడపీడల ఉధృతి ఆధారంగా మాత్రమే అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించడం ద్వారా కంది పంటలో అధిక దిగుబడులతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంది రైతు మాడెం యాదయ్య, మండల వ్యవసాయ అధికారి బండారు శివ, గ్రామ సర్పంచ్ ముడిగొండ యేసు, ఉప సర్పంచ్ జక్కుల సత్యనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, BTM రమేష్ తదితరులు, పలువురు రైతులు పాల్గొన్నారు.


